Saturday 29 December 2012

'కవన తరంగం' ఆంధ్ర తీర ప్రజలార్తనాదాలు

1990 లో ఆంధ్ర తీర ప్రాంతం తుఫానులో చిక్కుకుంది. ఆ సందర్భంగా అక్కడి ప్రజల ఆర్తనాద ఘోషను పద్య రూపంలో 'కవన తరంగం' గా తీసుకొచ్చారు మా బాబాయి కృష్ణమూర్తి కవి. దీని ముందు సంవత్సరం ఆయనే 'క్రాంతి దర్పణం' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ తర్వాత సమస్యా పురాణం తో వినోద కవనం అనే పుస్తకమూ వచ్చింది.

'ఆణిముత్యాలు' సాంప్రదాయ కవుల సాహితి మైత్రి!

'గుమ్మటాలు' పుస్తకం తర్వాత ఓంప్రకాష్ ప్రచురణాలయం ప్రచురణల బాద్యతను మా బాబాయి కృష్ణమూర్తి తీసుకున్నారు. 1978 లో 'పునీత చరితులు' పేరుతో ఓ పుస్తకం తెచ్చారు. ఆ తర్వాత తొమ్మిది ఏళ్ళకు వచ్చిన పుస్తకం 'ఆణిముత్యాలు'. శతాధిక సంప్రదాయ కవుల సాహితి మైత్రికి ఈ పుస్తకం దర్పణం పట్టింది. కవుల పద్యాలనూ, వారి పరిచయాలను ఈ పుస్తకంలో పొందుపరచడం విశేషం.

Friday 28 December 2012

'Andhrula Poratam' by George Fernandes

1973 లో ఓంప్రకాష్ ప్రచురణాలయం ద్వారా వచ్చిన నాలుగవ పుస్తకం 'ఆంధ్రుల పోరాటం'. ప్రత్యేక ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ఆవశ్యకతను వివరిస్తూ అప్పటి భారత సోషలిస్ట్ పార్టీ అద్యక్షుడు జార్జ్ ఫెర్నాండేజ్ వెలుబుచ్చిన  భావాలను పుస్తక రూపంలో మా నాన్న గారు తెచ్చారు. నాలుగు దశాబ్దాలు గడిచినా... నేటికీ అదే వాతావరణం వుంది. 

తొలి పుస్తకం!

1968 'పుష్పాభిలాష' పుస్తక ప్రచురణ తో ఓంప్రకాష్ ప్రచురణాలయం ప్రస్థానం మొదలైంది. దీని తర్వాత మా నాన్నగారు (శ్రీ వడ్డీ చంద్ర శేఖర రావు) తన స్వీయ రచనతో 'నేతాజీ బోసు జీవితం' పుస్తకం తేవాలని అనుకున్నారు. అలానే మా బాబాయ్ విజయసారధి రచన 'వీరపధం' (ఖండ కావ్యం) ప్రచురించాలని అనుకున్నారు. ఈ రెండు పుస్తకాలూ ఎందుకో రాలేదు! 

Saturday 4 August 2012

'గుమ్మటాలు' బాలల గీతాలు

'పుష్పాభిలాష', 'నవకవిత', విజ్ఞాన జ్యోతి', 'ఆంధ్రుల పోరాటం' గ్రంధాల తర్వాత ఓంప్రకాశ్ ప్రచురణాలయం నుండి వచ్చిన ఐదవ పుస్తకం 'గుమ్మటాలు'. ఈ బాలల గీతాల పుస్తకాన్ని డాక్టర్ వడ్డి విజయ సారధి రాశారు. ఈ గీతాలు ఆంధ్రజ్యోతి, కృష్ణాపత్రిక, జాగృతి, సాందీపని, బాల ప్రపంచం, పసిడిబాల, చుక్కాని తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి. బాల బంధు బి.వి. నరసింహారావు 'గుమ్మటాలు' పుస్తకానికి ముందు మాట రాశారు!



ఈ పుస్తకం లోని తొలి గేయం ఇలా సాగుతుంది...

నా పాట!

వ్రాసెద నే కవితలెన్నొ
పాడుకొనగ బాలలెల్ల
మెత్తనైన హృదులలో
హత్తుకొనే రీతిలో

భాషలోని భేషజాలు
బాట కడ్డు రాకుండా
కవితలోని కమ్మదనం
కాస్తైనా చెడకుండా

కాజాలదు నాపాలిట
వ్యాకరణము శృంఖలమ్ము
కాజాలదు నా ముందట
ఛందము ఫణిబంధము

పిల్లలెల్ల ప్రేమింపగ
పెద్దలెల్ల దీవింపగ
సరళమైన రీతి నడచి
సంతృప్తిని కలుగజేతు

వెన్నతోడ బెట్టదగిన
విద్య నేను నేర్పువాడ
ప్రతి బాలకు హృదినిండా
జాతీయత నేర్పువాడ.

ఇలా సాగిన ఆ కలం నుండి మరెన్నో ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు వచ్చాయి... వాటి గురించి మరో సారి!!

Saturday 28 July 2012

'విజ్ఞాన జ్యోతి' మకుట రహిత శతక గ్రంధం

శ్రీ బి. శ్రీనివాస గాంధీ రాసిన  'విజ్ఞాన జ్యోతి' మకుట రహిత శతక గ్రంధాన్ని ఓంప్రకాశ్ ప్రచురణాలయం మూడవ పుస్తకం గా 1971 లో ప్రచురించింది. దీన్ని శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారికి అంకితమివ్వటం జరిగింది. కృతిభర్త పరిచయాన్ని చాలా చక్కగా రాశారు మా నాన్న గారు వడ్డి చంద్రశేఖర రావు! అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కాకాని వెంకట రత్నం గారి చేతుల మీదగా ఈ పుస్తకం ఆవిష్కృతమైంది!

నవకవిత! (కవితాకదంబం)

'పుష్పాభిలాష' తర్వాత, ఓంప్రకాశ్ ప్రచురణాలయం ప్రచురించిన రెండవ పుస్తకం 'నవకవిత'! దీనికి బాలకవి వడ్డి కృష్ణమూర్తి కదంబకర్తగా వ్యవహరించారు. మునగ వెంకటేశ్వర్లు, సుమనశ్రీ, శీలం రాజేశం, వడ్డి విజయసారధి, తెన్నెల ఎలీషా, జే.ఎస్.ఆర్.కే. ప్రసాదరావు, రెడ్డి రాఘవయ్య, పరిమి వెంకట సుబ్రహ్మణ్యం, చిట్టా రామకృష్ణారావు, ప్రత్తిపాటి బేబి సరోజిని, కాజ లక్ష్మి నారాయణ, గుత్తికొండ సుబ్బారావు తదితరుల కవితలు ఇందులో పొందుపరిచారు.
'

Sunday 22 July 2012

మా మాట!

ఓంప్రకాశ్ ప్రచురణాలయం!

పేరులో పేర్కొన్నట్టుగానే ఇదో ప్రచురణ సంస్థ. మచిలీపట్టణం లో మా నాన్న గారు వడ్డి చంద్ర శేఖర రావు, దీనిని 1968లో  మొదలు పెట్టారు. తొలి యత్నంగా బాలకవి వడ్డి కృష్ణ మూర్తి రాసిన 'పుష్పాభిలాష' పుస్తకాన్ని వెలువర్చారు. రెండో పుస్తకం 'నవ కవిత'! ఇది ఓ కవితా కదంబం!! పలువురు కవుల కవితలను ఇందులో పొందు పరిచారు. ఇక మూడవది 'విజ్ఞాన జ్యోతి'. నాలుగవ పుస్తకం 'ఆంధ్రుల పోరాటం'. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెలియ చేస్తూ జార్జ్ ఫెర్నందేస్ చేసిన ప్రసంగం. ఇక ఐదవది డాక్టర్ వడ్డి విజయ సారధి రాసిన బాలల గేయాల పుస్తకం 'గుమ్మటాలు'.

ఇలా పలు పుస్తకాలు ఓంప్రకాశ్ ప్రచురణాలయం నుండి వెలువడినాయి. వాటి వివరాలను తెలియ చేయడమే ఈ బ్లాగ్ ఉద్దేశం. మీ సలహాలు, సూచనలు కోరుతూ....

భవదీయ
వడ్డి ఓంప్రకాశ్ నారాయణ
ఫోన్: 9666678197