Monday, 10 February 2014

Review published in gotelugu.com by sirasri


మనసు తడి ఆరనీకు - పుస్తక సమీక్ష - సిరాశ్రీ (gotelugu.com)
manasu tadi aaraneeku
రచన: ఓంప్రకాశ్ నారాయణ వడ్డి
వెల: 90/-
ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852, కేశవ నిలయం, బర్కత్ పురా, హైదరాబాద్-27
దూరవాణి: 040-27563236
రచయితను సంప్రదించాలంటే :
దూరవాణి-  9985474888
ఈ మెయిల్- omprakashvaddi@gmail.com

చాలా కాలం తర్వాత నిజంగానే మనసు తడిని తడిమిన కథాగుఛ్ఛం ఈ 'మనసు తడి ఆరనీకు’.
నగరవాసి, పట్టణ వాసి, పల్లె వాసి అన్న తేడా లేకుండా మాధ్యమాల నడుమ నలిగిపోతూ మూలాల్ని, మనిషి తనాన్ని మరిచిపోయిన సగటు మానవుడికి మట్టి వాసనని, ఆర్తిని, ఆర్ద్రతని గుర్తుచేసే పుస్తకం ఇది. ఏ కథ మొదలుపెట్టినా ఒక దృశ్యకావ్యంలా సాగుతూంటుంది. కథ కంచికి చేరేసరికి మనసుని తడి చేసి కళ్ళల్లో చెమ్మ చేరుస్తుంది. కథన శైలి, పదాల అల్లిక ఎక్కడా ఇబ్బంది పెట్టవు.
మొదటి కథ 'నాణానికి రెండో వైపు’ సరదాగా నడిచి చక్కటి ముక్తాయింపు పలుకుతుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ఏడుకొండలవాడు ఇచ్చిన వరం ఒక భర్త జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనేదే ఈ కథ. కొంత సోషియో ఫాంటసీ ఛాయ కనిపించినా స్వప్న వృత్తాంతంగా మలిచి వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చారు రచయిత.
‘దిల్ హై తో బస్’ లో రచయిత ఒక స్త్రీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి కథావిష్కరణ చేసిన తీరు ప్రశంసించాల్సిందే. పల్లెటూరి స్త్రీ మనసులోని సున్నితత్వం, అమాయకత్వం ఆవిష్కరిస్తూ భారతీయతను చాటే కథ.
ఇక ‘దారి తప్పిన కోయిల’ కూడా రచయిత స్త్రీ మనసులోంచి రాసిందే. ఒక ఉత్తరంగా కనిపించే ఈ కథ ముగింపులో మనసుని తడి చేయడం ఖాయం.
‘ఆత్మావలోకనం’ మరో చక్కటి కథ. జీవితాన్ని మెదడుతో కాకుండా మనసుతో జీవిస్తే ఎలా ఉంటుందో ఆలోచింప చేస్తుంది.
‘జాలి కోల్పోయిన మనిషి’ ఆసక్తిగా మొదలై సాగుతుంది. కర్మ సిధ్ధాంతాన్ని, మానవత్వాన్ని మెత్తగా తాకుతుంది ఆ కథ.
ఇక ఈ పుస్తకంలోని 19 వ కథ రచయితకి నచ్చిన కథ అని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆ కథ టైటిల్ నే ఈ పుస్తకానికి టైటిల్ గా పెట్టుకున్నారు—‘మనసు తడి ఆరనీకు’. సినిమా వాసన అంటిన మనిషి ఎలా మరతాడు అనేది ఈ కథలో ఇతివృత్తం అయినా నిజానికి డబ్బు, పరపతి పెరిగేసరికి మనిషి మనసు ఎలా రూపాంతరం చెందుతుందో కనిపిస్తుంది ఇందులో. ముగింపుని ఒక శేష ప్రశ్న లా వదిలివేయడం రచయిత చేసిన మంచి పని. ఈ కథకి ముగింపు పాఠకుల ఊహదే.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథా ఒక అనుభూతిని ఇచ్చేదే. ప్రతి పాత్ర మన మధ్యలో కదలాడేదే. ఎక్కడా మితి మీరిన భావుకతలు, అనవసర ఉపోద్ఘాతాలు, దృశ్య వివరణలు లేకుండా నేరుగా విషయంలోకి వచ్చేస్తుంటాయి కథలన్నీ.. అదే రచయితను ఈ కాలం పాఠకుల మెప్పు పొందేలా చేస్తుంది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే రచయిత వడ్డి ఓంప్రకాశ్ నారాయణ వృత్తి రీత్యా ఒక మీడియా చానల్ లో పని చేస్తుంటారు. సాధారణంగా మీడియా లో పని చేసేవారికి వృత్తి లక్షణంగా ఏ విషయం మీదా అయినా అదే పనిగా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఒక విషయం గురించి మనసు పొరల్లోంచి ఆలోచించే లోగా ఇంకో అంశం ఎదురుపడుతుంది. పాతది వదిలేసి కొత్తది పట్టుకోవాలి. అలా తాత్కాలిక భావోద్వేగాలు పొందీ, పొందీ క్రమంగా మనసు తడి ఆరిపోతూ ఉంటుంది. కానీ వడ్డి వారు ఆ తడి ఆరనీయకుండా నిలుపుకుని ఇంత చక్కటి కథలు రాయగలిగారంటే వారిని మనసు తడితో ప్రశంసించాల్సిందే.

No comments:

Post a Comment